కొమురవెల్లి, అక్టోబర్ 9: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని గౌరీభట్ల శ్రీనాథ శర్మ (70)గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మర్రి ముత్యాలకు చెందిన ఆయనకు భార్య,కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ధార్మికవేత్తగా సంస్కృతాంధ్ర భాషా పండితుడుగా, కవిగా శ్రీనాథ శర్మ సుపరిచితులు. పదవ తరగతి మాత్రమే చదువుకున్న శ్రీనాథ శర్మకు జన్మతః అబ్బిన విజ్ఞానంతో సంస్కృత, ఆంధ్ర భాషలలో కవిత్వం చేసేవారు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయులకు సైతం అర్థం కాని అనేక సంస్కృత పద్యాలను అలవోకగా అర్థవంతంగా బోధించేవారని వారి సమకాలీకులు గుర్తు చేసుకుంటారు. తను పర్యటించిన కాశీ, మధుర, వేములవాడ వంటి క్షేత్రాలలో అప్పటికప్పుడు అలవోకగా పద్యాలను చెప్పి తమ కవితా పటిమను ప్రదర్శించేవారు. గట్టిపట్టుతో అష్టావధానాలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆశు కవిత్వంతో పాటు తను నమ్మిన దైవాన్ని కీర్తిస్తూ అనేక మంగళహారతులు రాశారు. సిద్దేశ్వర స్వామి సుప్రభాతం,అమ్మవారి స్తుతులు, సాంద్రానంద స్వామి వారి మేలుకొలుపు, జీవన చరిత్రలు, జోల పాటలు, స్వామివారి పూజా విధానంతోపాటు రాసిన అనేక రచనలు సాహితీప్రియులను అలరిస్తున్నాయి.
సాంద్రానంద స్వామి వారి అష్టశష్టి ఉపచార పూజతో పాటు సవివర జీవన చరిత్రను రమణీయంగా రచించారు. విలువైన సమాచారంతో కూడిన సాంద్రానంద మాసపత్రికను అనేక సంవత్సరాలు నిర్వహించారు. కేవలం కవిగానే కాకుండా సమాజాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించే అనేక కార్యక్రమాలను పూర్వ మెదక్ జిల్లాలో విస్తృతంగా నిర్వహించారు. కొడవటూరులో సహస్ర రుద్రం, మర్రిముత్యాలలో నారాయణ అష్టాక్షరి యజ్ఞం, కోటికుంకుమార్చన, ఏడు రోజులపాటు సంతత రుద్రాభిషేకం, చండీ హోమం, శత సహస్ర పార్థివలింగార్చన, రుద్ర యాగాలు నిర్వహించి ఆధ్యాత్మిక వ్యాప్తికి దోహదం చేశారు. కొన్ని దశాబ్దాల పాటు అనేక గ్రామాలలో హనుమాన్ చాలీసా పారాయణ పూజ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధానంగా యువతను ఆధ్యాత్మికతవైపు మరలేలా కృషి చేశారు. తెలంగాణ జిల్లాలలోని భక్తుల ఇళ్లలో గురుపాదుక పూజలు నిర్వహించడమే కాక జీవితంలో గురు సాంగత్యం వల్ల కలిగే ఔన్నత్యాన్ని ప్రచారం చేశారు.
తన తండ్రి నడియాడిన దైవంగా భక్తులు కొనియాడే సాంద్రానంద స్వామి పేరిట ఆశ్రమాన్ని స్థాపించి అనేక విశేష పూజలను నిర్వహించారు. దక్షిణామూర్తి, లలితా పరాంబిక, దత్తాత్రేయ స్వామితో కూడియున్న స్వామి మూర్తిని ప్రతిష్టించి, ప్రతి వసంత పంచమికి అత్యద్భుతంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక శత చండీ యాగాలకు సమన్వయకర్తగా సేవలందించారు.