హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీసీలంటే సీఎం రేవంత్‌రెడ్డికి అంత చులకన ఎందుకని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో కులగణన స్టేట్మెంట్ను ప్రవేశపెట్టారని, ఆ డిక్లరేషన్‌కు విలువ లేకపోతే పత్రాలను రేవంత్‌రెడ్డి తగలబెట్టి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీగణన సబ్ కమిటీ చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్ప మరొకరు దొరకలేదా? బీసీల్లో అసలు సమర్థులు లేరా? అని ప్రశ్నించారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బయట చెప్పిన దానినే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది తప్ప కొత్తగా చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్ క్యాబినెట్లో ముగ్గురే అగ్రవర్ణాల వారు ఉండాలని, మిగతావారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో బలమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల బీసీ జనాభాను తగ్గించారని, ప్రాంతాలవారీగా అన్ని కులాల జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని మోదీకి భయపడే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రేవంత్ తీర్మానం చేయలేదని గట్టు రాంచందర్‌రావు విమర్శించారు. బడే భాయ్, చోటే భాయ్ రహస్య ఒప్పందం మరోమారు బయటపడిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా కాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ మరో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని పెడితే, మరో పార్టీ ఓసీ అభ్యర్థిని పెడుతుందని, డబ్బులు ఎక్కువ ఖర్చుచేసే వ్యక్తే గెలుస్తాడని, అన్ని పార్టీలూ బీసీ అభ్యర్థులను ఒకేచోట పెట్టేలా చట్టబద్ధత ఉంటేనే న్యాయం జరుగుతుందని అన్నారు.
కేసీఆర్ హయంలో సమగ్ర కుటుంబ సర్వేను ఇప్పుడున్న అధికారులే చేశారని, అప్పటికీ ఇప్పటికీ బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. జనాభా లెకల ప్రకారం ఏటా 1.3% చొప్పున పెరగాలి గాని ఎందుకు తగ్గిందని నిలదీశారు. కావాలనే కొందరి ఇండ్లకు వెళ్లకుండా బీసీల జనాభాను తగ్గించారని ఆరోపించారు. ఇది బీసీల సమస్య అని, పార్టీలకు ఆతీతంగా బీసీలు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరిగే దాకా బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు.