వరంగల్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏశబోయిన గట్టయ్యకు వ్యవసాయం అంటే మక్కువ. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు. ఊరి పక్కనే చెరువు. నీళ్లు ఉండేవి కావు. ఎప్పుడూ కరువు కాటకాలే. మెట్ట పంటలు వేద్దామంటే పెట్టుబడికి చేతిలో పైసలు లేకపోయేవి. అప్పులు చేసి సాగు చేసినా నీళ్ల వసతి లేక సరిగ్గా పంటలు పండేవి కావు. ఏం చేయాలో దిక్కుతోచక ఉన్న ఊరిని వదిలి భార్యా,పిల్లల్ని తీసుకొని కాజీపేటకు వచ్చి ఎఫ్‌సీఐ గోదాములో హమాలీగా చేరాడు. ఏండ్ల తరబడి అదే పనిచేసి పిల్లల్ని పెద్దచేసి పెండ్లిళ్లు చేశాడు. వయసు మీదపడినా ఎవుసం చేయాలన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తికావడంతో గట్టయ్య ఊరికి నీళ్లు వచ్చినయి. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంటు వచ్చింది. పెట్టుబడికి రంది లేకుండా ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున అందిస్తున్నది. దీంతో గట్టయ్య సొంతూరుకు చేరుకొని వ్యవసాయం ప్రారంభించాడు.
వయసును సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా సాగు వైపు కదిలాడు. వానకాలం, యాసంగి రెండు పంటలు వరి పండిస్తున్నాడు. వారం కిందట 3 ఎకరాలకు రైతుబంధు పైసలు రూ.15 వేలు జమైనయి. యాసంగి నాటు పనుల్లో నిమగ్నమయ్యాడు. ‘ఇయ్యాల నారు పెట్టిన. రేపు కూలోళ్లు వత్తమన్నరు. కేసీఆర్ సార్ పైసలు నిన్ననే ఇడిపిచ్చుకచ్చి కొన్ని వాళ్లకిచ్చిన. ఇంకొన్ని వెట్టి ఎరువుల బత్తలు తెచ్చిన. ఎవుసానికి గిట్లాంటి రోజులు వత్తయని నేను కలల సుత అనుకోలే. పెట్టుబడి లేని ఎవుసం చెయ్యలేక మావోళ్లు ఎందరో తనువు సాలించిన్లు. కేసీఆర్ లాంటి మంచోడు గప్పట్లనే ముఖ్యమంత్రి అయితే షాన మంది హుషారుగ ఎవుసం జేసెటోళ్లు. ప్రతి ఏడు వానలకు ఎదురు చూసుడు ఉండేది కాదు. ఎన్నో తిప్పలు పడి వరంగల్ బాట పట్టిన. మల్ల ఇప్పుడు వచ్చి ఊర్ల యవుసం చేస్తున్న. ఇక్కడ ఉండే తృప్తి వేరే ఉంటది’ అని గట్టయ్య తన అనుభవాల్ని వివరించాడు.
రెండు పంటలు ఏస్తున్నా
నాకు 5 ఎకరాల భూమి ఉన్నది. ఇంతకుముందు పంటలు ఏయడానికి పైసలు లేకపోయేవి. విత్తనాలు, ఎరువులు ఉద్దెర ఇవ్వాలని దుకాణాల చుట్టూ తిరిగినా రేపు, మాపు అంటూ సతాయించేటోళ్లు. కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పథకంతో మా కష్టాలు తీరినయి. 5 ఎకరాలకు రెండు కార్లకు కలిపి రూ.50 వేలు వస్తుండడంతో విత్తనాలు, ఎరువులు కొంటున్నా. గతంలో ఒక పంట సాగు చేయాలంటే ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా ఉన్నా. పేద రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అన్ని సౌలత్లు చేస్తున్నడు. ఆయనను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.
– ఇస్తారి, అనుకుంట, ఆదిలాబాద్ జిల్లా
రైతుకు పతారా పెరిగింది
కేసీఆర్ సారు సీఎం కాకముందు ప్రతియేడు పెట్టుబడి కోసం అప్పులు చేసేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ పూర్తిగా తప్పింది. వానకాలం, యాసంగికి ముందే మా ఖాతాలల్ల ఎకరానికి రూ.5 వేలు ఏస్తున్నడు. సీఎం సారు సల్లగ ఉండాలె. ఒకప్పుడు ఎవుసం చేసేటోళ్లను నామోషిగ చూసేటోళ్లు. కేసీఆర్ సారు చేయవట్టి ఎవుసం చేసెటోడే గొప్ప అనే పేరచ్చింది. నాకు మూడెకరాల భూమి ఉన్నది. పదిహేనువేల రూపాయలు ఖాతాల పడ్డయ్. నేను, నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నం. యాసంగి నాట్లు వేసిన. 24 గంటల కరెంటు ఉన్నది. ఎలాంటి రంది లేకుండా పొలం పారిచ్చుకుంటున్నం. రైతుల గురించి ఇంత మంచిగ పట్టించుకున్న సర్కారును నేను ఎన్నడూ చూడలే. సీఎం కేసీఆర్ వల్లే మా భూములకు విలువచ్చింది.
– గంగాధరి రాజయ్య, చౌటపల్లి, అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా
మాసోంటోళ్లను ఆదుకుంటున్నరు
అన్నం పెట్టే రైతులను సర్కారు ఆదుకుంటున్నది. పెట్టుబడి సాయం చేస్తున్నది. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నది. రైతులు చనిపోతే కుటుంబానికి రైతుబీమా ద్వారా భరోసా ఇస్తున్నది. 24 గంటల కరెంటు ఇచ్చి పుష్కలంగా పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నది. రైతులకు ఇంకా కావాల్సింది ఏమున్నది ? కేసీఆర్ సార్ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నడు. తెలంగాణ రాకముందు పెట్టుబడి కోసం అప్పులు చేసి వాటిని తీర్చేందుకు పంటమొత్తం అమ్ముకొంటిమి. ఇప్పుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నరు. రైతుబంధు అండగా నిలుస్తున్నది.
– గంటె వెంకటరాజు, గాంధీనగర్, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా
80 ఫీట్లల్ల నీళ్లు ఊరుతున్నయి
ఉమ్మడి రాష్ట్రంల రూ.3 లక్షలు పెట్టి 500 ఫీట్లలోతున 6 బోర్లు ఏసిన. సుక్క పదను రాలె. నాకు 5 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. ఎలుగటి పంటలు ఏసి ఉన్నదోలేందో తిని బతికేది. బోర్లేస్తే అప్పుల పాలైనం. మా నాయన గొర్లు కాసేది. గొర్లమ్మి అప్పు తేర్పినం. ఊరంత ఇదే పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చినాంక మా ఊరు పైన చీటకోడూరు రిజర్వాయర్ల ఫుల్లు నీళ్లు ఉంటున్నయ్. అట్టి గడ్డకు బోరేసినా నీళ్లు ఫుష్కలం. నా బోర్ల 80 ఫీట్లల్ల నీళ్లు ఊరుతున్నయ్. అప్పుడు నీళ్లు లేక సచ్చినం. ఇయ్యాల రెండు కార్లు నాటు పెడుతున్న. వానకాలం, యాసంగి రైతుబంధు పడ్తుంది. డబ్బులకు ఇంకొకరిమీద ఆధారపడకుండ బతుకుతున్నం. ఊర్ల నుంచి పట్నం వలసబోయే రైతు, పట్నం నుంచి పల్లెకు వచ్చి ఎగుసం చేసే రోజు కేసీఆర్‌తోనే సాధ్యమైంది.
– దండబోయిన సారయ్య, చౌడారం, జనగామ జిల్లా