అమ్రాబాద్, సెప్టెంబర్ 24: చంద్రకళ..! కష్టాలు చుట్టుముట్టినవారికి ఆమె ఓ రోల్ మాడల్. ఓ వైపు మంచానపడ్డ భర్తను సాకుతూ.. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన స్ఫూర్తి కెరటం. ఆమెది నలమల అటవీ ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్. ఆమె భర్త గంజి దేవేందర్.. 15 ఏండ్ల క్రితం.. ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముకకు దెబ్బతిన్నది. శరీరంలో నడుము కింద భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కదలలేని పరిస్థితి. మంచానికే పరిమితం అయ్యాడు. అప్పటికి ముగ్గురు ఆడపిల్లలూ చిన్న పిల్లలే. కుటుంబ పోషణభారం చంద్రకళ మీదనే పడింది. భర్తకు అవసరమయ్యే మందుల కోసం నెలకు రూ.ఐదు వేల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయితేనేం.. ఊహించని ఈ కష్టాన్ని సవాల్‌గా తీసుకొన్నది. ఇంటి వద్దనే చిన్న కిరాణ దుకాణం.. అందులోనే పిండి, కారం గిర్ని.. వీటితోనే ఆమె జీవిత సాగరాన్ని ఈదడం నేర్చుకొన్నది. తాను కష్టపడుతూ పిల్లలను చదివించింది. ఉత్సాహపరిచింది. ఉత్తమ లక్ష్యాల వైపు నడిపించింది. పెద్దమ్మాయి భార్గవి చిన్నతనం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో చదువుకొన్నది. నీట్లో ర్యాంక్ సాధించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే గుంతకల్ కాలేజీలో ఆయుర్వేద మెడిసిన్ చేస్తున్నది. ఇప్పుడు ఫైనల్ ఇయర్. త్వరలో డాక్టర్ పట్టా అందుకోబోతున్నది. రెండో అమ్మాయి లిఖిత కూడా లక్ష్యంపైనే గురిపెట్టింది. ఈ ఏడాది నీట్లో 504 మార్కులు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ సీటు పొందబోతున్నది. చిన్న కూతురు మాధురి కూడా ఎంబీబీఎస్ సీటు సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొంటున్నది. ఈ కుటుంబానికి
అచ్చంపేటలోని ఇచ్డియన్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అండగా నిలించింది. లిఖిత, మాధురికి ఉచితంగా చదువు చెప్పింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. ఎంబీబీఎస్ సీటుపై గురిపెట్టి సాధించిన లిఖితను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఆయన కుమారుడు భరత్ వీరి ఇంటికి వెళ్లి లిఖితను అభినందించారు. వైద్య విద్యకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని, ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ఉన్నత చదువులకు ప్రభుత్వం, దాతలు సహకరిస్తే.. వైద్య వృత్తి ద్వారా పేదలకు సేవ చేస్తామని చెప్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.
కష్టానికి ప్రతిఫలం దక్కింది
నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నా బిడ్డలు ఆయుర్వేదంలో, ఎంబీబీఎస్‌లో సీట్లు పొందడం సంతోషంగా ఉన్నది. సమాజంలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. దాతలు సహకరిస్తే నా కూతుళ్లను ఉన్నత విద్య చదివిస్తా. – గంజి చంద్రకళ,అమ్రాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా