IIT Students | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో విద్యాభ్యాసం.. కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఇద్దరు ఐఐటీ విద్యార్థులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందిన కొలి మణికంఠ చౌదరి, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పవన్.. తమిళనాడులోని ఐఐటీ క్యాంపస్‌లో చదువుతున్నారు.
చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్మి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్లో ఉన్న ఓ హాస్టల్లో తమ దందా నడుపుతున్నారు. రూ.వెయ్యికి 20 గ్రాములు చొప్పున అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్‌పై దాడిచేసి ఇద్దరిని అరెస్టుచేశారు. వారి వద్ద 1.2 కిలోల గంజాయితో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరికి గంజాయి సరఫరా చేస్తున్న వైజాక్‌కు చెందిన కమలేశ్, అమోశ్పై కేసు నమోదుచేశారు. నిందితుల వద్ద గంజాయి కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించి, వారిపైనా కేసులు పెట్టారు. అదేవిధంగా, నెల్లూరు జిల్లాకు చెందిన ఎర్రగంటి లోకేశ్.. నగరంలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. గంజాయి మత్తుకు అలవాటు పడటంతో ఉద్యోగం పోయింది.
గంజాయి విక్రయాలనే వృత్తిగా మార్చుకున్న లోకేశ్.. మణికొండలో ఇల్లు అద్దెకు తీసుకుని దందా కొనసాగించాడు. సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు.. నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద 1.74 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన నెల్లూరు వాసి శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశారు.