హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనే క్రమంలో ఎక్సైజ్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. సౌమ్యకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విధి నిర్వహణలో గాయపడిన సౌమ్యకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ఖాసీంతో మంత్రి జూపల్లి ఫోన్లో సంభాషించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా అరెస్టు చేయాలని, గంజాయి ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేశారు.