కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 21: బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలోనే వారి రంగు బయటపడుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalkar) అన్నారు. కానీ వారి ఆటలు సాగబోవని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా(BRS party) ఎగురవేస్తామని శపథం చేశారు.
కార్యకర్తలు అధైర్య పడవద్దని..ఆపదవస్తే అండగా నిలుస్తాం అని భరోసా ఇచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణమండపంలో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. గంగులతో పాటు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు కసిగా పనిచేయాలని ఉద్బోధించారు. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, ఎంపీపీ పిల్లి శ్రీలత, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ పాల్గొన్నారు.