కొత్తపల్లి, మే 14: రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు కొత్తపల్లి మండలం చింతకుంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అదనపు కలెక్టర్, డీఎస్వో, డీఎంతో ఆయన ఫోన్లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ధాన్యం తూకంలో బస్తాకు 40 కిలోల 600 గ్రాములు పెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం 42 కిలోల నుంచి 43 కిలోల వరకు తూకం వేస్తున్నదని మండిపడ్డారు.

రాయికల్, మే 14 : అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరితగతిన వరి, మక్కల కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్, చింతలూరు, కొత్తపేట, మూటపెల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, ఎకడికకడ కుప్పలు అలాగే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రాల్లో లారీలతోపాటు హమాలీల సమస్య ఉన్నదని తెలిపారు. ధాన్యం తూకం లేక హమాలీకి పని లేక వారు అందుబాటులో ఉండటం లేదని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఫోన్ చేసి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.

పెగడపల్లి, మే 14: క్వింటాల్‌కు 7.5 కిలోల వరకు ధాన్యంలో కోత విధిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జిల్లా మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

మోర్తాడ్, మే 14: ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, కమ్మర్పల్లి, భీమ్‌గల్ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను వేముల గురువారం పరిశీలించారు. గన్నీ బ్యాగులు, లారీల కొరతతో పాటు కాంటా, బస్తాల తరలింపులో జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

పర్వతగిరి, మే 14 : అన్నదాతను అరిగోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ రైతులు గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తమ గోడు విన్పించారు. వెంటనే ఆయన దౌలత్నగర్లోని మిల్లును సందర్శించారు. మార్ఫెడ్ జీఎంకు ఫోన్ చేసి, రైతుల సమస్యలను పరిషరించాలని కోరారు. సర్కార్ మెడలు వంచైనా పంటలు కొనుగోలు చేయిస్తామని రైతులకు భరోసా కల్పించారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు కావస్తున్నా అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యహరిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
– హన్వాడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బాల్నగర్ కేంద్రంలో కాంటా వేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మామిండ్ల గంగయ్య ధాన్యం తెచ్చి 28 రోజులైనా కాంటా వేయలేదు. సొంత వాహనం తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంతో గురువారం సొంత ట్రాక్టర్‌తోపాటు మరో రెండు ట్రాక్టర్లను సమకూర్చుకోవాల్సి వచ్చింది.
– వేములవాడ