Minister Gangula | పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు వివక్షను ఎదిరించి ఆత్మగౌరవం కోసం నిజాం వ్యతిరేకంగా బందూక్ను చేతబట్టి ఐలమ్మ పోరాటం చేశారన్నారు.
సమైక్య పాలకులు తెలంగాణ వీరుల చరిత్రను కనుమరుగు చేశారని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీన వర్గాల చరిత్ర తెలిసేలా పార్యఠ పుస్తకాల్లో పెట్టడం, ఐలమ్మ జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడం వారికి ఇచ్చిన విలువ అన్నారు. ఒకప్పుడు వెనుకబడిన తరగతులకు విద్య అందలేదని.. కేవలం కులవృత్తులు చేసుకునే వారిని వెనక్కి నెట్టివేశారన్నారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతను అందించడమే కాకుండా.. తమ బిడ్డల్ని చదివిస్తూ విదేశాలకు పంపించి గర్వంగా జీవించేలా చేశారన్నారు. గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వీరుల గాథలు తెలిసేలా చేయడం అభినందనీయమన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని, ఢిల్లీ పాలకుల చేతిలో తెలంగాణను పెడితే మళ్లీ మన వనరులు, సంపద దోచకుంటారని, వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.