కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీని కూల్చి తాను సీఎం అవుతానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఆయనకు తన క్యాబినెట్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే ముప్పు ఉన్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం ఐదేండ్లపాటు కొనసాగాలని కేసీఆర్ ఆశీర్వదించారు తప్ప, ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకీ లేదని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో మంజూరై ఆగిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరుతూ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేసీఆర్‌ను ఆడిపోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి భయం లేదని, ఆయనకు కింద పనిచేసే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచే పదవీ గండం ఉండే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పదేండ్లలో కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధితో కళకళలాడిన జిల్లా ఇప్పుడు కళావిహీనంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కూడా విజ్ఞప్తి చేస్తున్నానని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి డంపింగ్ యార్డు పనులు పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో నిర్మించిన చెక్‌డ్యాంలపై విజిలెన్స్ విచారణ చేసినా తామేమీ భయపడేది లేదని తేల్చి చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లలో భారీ స్కాం జరుగుతున్నదని, క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్క ఇల్లు మంజూరుకు రూ. 50 వేలు లంచంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలని, ఈ విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలపై ఆసక్తి చూపుతున్నదని విమర్శించారు.
అందాల పోటీల పేరిట రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆడబిడ్డల పరువు తీశారని మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన వారి కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించేందుకు సీఎంకు ఎంత ధైర్యమని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తమ ప్రభుత్వ హయాంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.