భద్రాచలం/ పాల్వంచ రూరల్/ కొత్తగూడెం క్రైం, ఆగస్టు 24: ఆదివాసీ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆటో ఎక్కిన 17 ఏండ్ల బాలికకు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. స్పృహ కోల్పోయాక సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్-ఏపీ సరిహద్దు రాష్ర్టాల్లో జరగ్గా.. బాధితురాలిని తెలంగాణ పరిధిలోని పా ల్వంచలో శుక్రవారం రాత్రి వదిలి పారిపోయారు. అయితే ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని చింతూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలికకు రెండేండ్ల క్రితం వివాహమైంది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బోదగూడెంలో గల తన పిన్ని ఇంటి నుంచి శుక్రవారం ఉదయం తన స్వగ్రామానికి బయలుదేరింది. అదే రాష్ట్రంలోని కుంట వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆ ఆటోలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారంతా కలిసి ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు.
అది తాగిన తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని చట్టి, ఏపీలోని చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. స్పృహలోకి రాకపోవడంతో శుక్రవారం రాత్రి భద్రాద్రి జిల్లా భద్రాచలానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి గుడి వద్దకు వచ్చారు. అప్పటికీ కూడా స్పృహలోకి రాకపోవడంతో అర్ధరాత్రి ఆమెను అక్కడ దింపి వెళ్లిపోయారు. శనివారం ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమె ఆలయ సమీపంలో అటూఇటూ తిరుగుతుండగా స్థానికులు అదే ప్రాంతంలో ఉన్న పీహెచ్సీ వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులతోపాటు పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు ఆమెను తమ సంరక్షణలోకి తీసుకొని కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతున్నది. ఆమె తన వివరాలను తెలిపేంత పూర్తిస్థాయి స్పృహలోకి రాలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక వివరాల ఆధారంగా పాల్వంచ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఏపీకి బదిలీ చేశారు. బాధితురాలు స్పృహలోకి వస్తేనే వివరాలు తెలుస్తాయని పాల్వంచ సీఐ సురేశ్ పేర్కొన్నారు.