సిరిసిల్ల తెలంగాణచౌక్, డిసెంబర్ 31: నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆయన సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. నకిలీ ష్యూరిటీ సర్టిఫికెట్లు పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా, డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు, కల్యాణలక్ష్మి పొందడానికి నకిలీ అర్హతపత్రాలు ఇస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తున్న సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు ఎస్పీ తెలిపారు.
నిందితుడికి సహకరించిన ప్రకాశ్, శివాజీ, రాజేశ్, అడ్వొకేట్ విష్ణు, మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, శీలం రాజేశ్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి స్టాంప్ ప్యాడ్స్, నాలుగు సెల్‌ఫోన్స్, పాలీ స్టాంపర్, ముట్టీలు, సిలికాన్ షీట్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.