హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రవిడ కంచికామకోటి 71వ పీఠాధిపతిగా ఎంపికయ్యారు. ఈ నెల 30న అక్షయ తృతీయను పురస్కరించుకొని కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు.
సామాన్య శకానికి ముందు 482వ సంవత్సరంలో కంచికామకోటి పీఠాన్ని స్థాపించిన జగద్గురు ఆదిశంకరాచార్య 2,534వ జయంతి మహోత్సవానికి (మే 2)కు ముందు ఈ కార్యక్రమం జరగనుండటం విశేషం. బ్రహ్మశ్రీ దుడ్డు ధన్వంతరి-మంగాదేవి దంపతులకు జన్మించిన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. రుగ్వేదాన్ని అభ్యసించి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రుగ్వేద పారాయణదారుగా విధులు నిర్వర్తించారు. రుగ్వేదంతోపాటు ఆయన యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు.