హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పర్యావరణానికి హానిచేయని మట్టితో తయారైన వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సమాచార పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక కోరారు. సోమవారం సమాచారశాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణేశ్ చతుర్థి పదిరోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేరొన్నారు. రసాయనాలు, పీవోపీతో తయారు చేసిన గణపతి విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకులు డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్లు డీ శ్రీనివాస్, కే వెంకటరమణ, సీఐఈ రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టర్లు ఎం మధుసూదన్, సీ రాజారెడ్డి, సమాచారశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు హోంగార్డులకు ప్రతిష్ఠాత్మక మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ (ఎంఎస్ఎం)ను ప్రదానం చేసింది. తెలంగాణ పోలీసు అకాడమీలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న జే రాజు, గ్రేహౌండ్స్ హోంగార్డ్ పీ సంగంలను ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డుల అడిషనల్ డీజీ స్వాతిలక్రా సోమవారం అభినందించి.. ప్రశంసా పత్రాలను అందజేశారు.