హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్‌లో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలను ఆయన మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ఆదివార తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్‌లో ఇచ్చిన 1500 ఇందిరమ్మ ఇళ్లలో 300 ఇళ్లు మాత్రమే కట్టారు. ఆడిటోరియంలో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పొంగులేటి చేతులు దులుపుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ ఇళ్లు కట్టలేదని చెప్పడం విడ్డూరంగా ఉందననారు.
బాన్సువాడలో 11,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేసీఆర్ హయాంలో కట్టారని గుర్తు చేశారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు బయటపడింది. చివరలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధర్నా పేరుతో 50 మందితో హడావుడి చేశారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను మాత్రం హౌస్ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. 22 ఎ విషయంలో రాష్ట్రం మొత్తం రగిలిపోతుంది. స్వయంగా సీఎం ఇళ్లు 22 ఎ లో పడింది. 22 ఎ డబ్బులు వసూలు చేసే మిషన్ గా మారిందని మండిపడ్డారు.
సీఎంకు, మంత్రుల మధ్య సఖ్యత లేదు. మంత్రులకు ,ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని పేర్కొన్నారు. కొండా సురేఖ కుమార్తె సీఎంపై అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రులు కమీషన్ల పేరుతో దండుకుంటున్న విషయం అందరికి తెలుసన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్ ప్రజలకు మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సుమిత్రానంద్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ,మన్నె గోవర్ధన్ రెడ్డి , బొమ్మెర రామమూర్తి ఉన్నారు.