Vadodara | గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఉన్న కర్జన్కు సమీపంలో జాతీయ రహదారి (NH) 48పై సీఎన్జీ (CNG)తో నడిచే కారు భారీ శబ్దంతో పేలింది. దీంతో చుట్టుపక్కలవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో మరో రెండు వాహనాలు ధ్వంసమవడంతో పాటు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్టోబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్జీ బంకులో కారును పంపు బే వద్ద నిలిపి డ్రైవర్ బయటకు వెళ్లాడు. ఇంధనం నింపుతుండగా కారు పేలి మంటలు చెలరేగాయి. బంకు సిబ్బంది ఆ సమయంలో కొంత దూరంలో ఉండటంతో ఎవరికి ఏమి కాలేదు.
కారులోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. అద్దాలు పగిలి కొంతదూరం ఎగిరి పడ్డాయి. కారుకు దగ్గరలో ఉన్న మరో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే బంకులో కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఫైర్ సిబ్బంది (Firefighters) వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాద పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియలేదు. కానీ దీనికి సీఎన్జీ కిట్‌లో లీకేజీ లేదా సిలిండర్ వాల్వ్‌లో లోపం కారణం కావచ్చని అంచనావేస్తున్నారు.
ఈ ప్రమాదం సీఎన్జీ బంకుల వద్ద భద్రత కోసం తనిఖీలు (Safety Checks) చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతుంది. సీఎన్జీ నింపు సమయంలో ప్రయాణికులు, డ్రైవర్లు తప్పనిసరిగా వాహనం నుంచి బయటకు రావాలని చెప్పకనే చెబుతుంది ఈ ఘటన.