OM Chapter 1 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, లెజెండరీ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం చాప్టర్ 1’. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వం వహిస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదలవుతుండటంతో, రజినీకాంత్ పై ఉన్న అపారమైన గౌరవంతో ధనుశ్ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున క్లాష్ ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రజినీకాంత్ సినిమాతో పాటు, దీపావళి బరిలో నిలవాలని భావించిన హిందీ చిత్రం ‘రామాయణ పార్ట్ వన్’ మరియు సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమాలతో కూడా ఎలాంటి పోటీ లేకుండా ఉండేందుకే ఈ నవంబర్ తేదీని లాక్ చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమలో పెద్ద సినిమాలు ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవాలని, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని ధనుశ్ అభిప్రాయపడ్డారు.
రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎజిల్ అరసు కె. సినిమాటోగ్రఫీ, ఆర్. కలైవనన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రద్ధా అగర్వాల్, ధనుశ్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.