హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికలపై తమ పార్టీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లింగమూర్తి హత్యను స్థానిక మాజీ ఎమ్మెల్యేగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నేత యాకూబ్రెడ్డితో కలిసి గండ్ర మీడియాతో మాట్లాడారు.
లింగమూర్తి హత్య అనంతరం వాస్తవాలు తెలుసుకోకుండానే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు ఆపాదించాలని శతవిధాలా ప్రయత్నించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక భూవివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని మృతుడి భార్య ఫిర్యాదు చేశారని, ఆ మేరకే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు చూపారు. ఆ తర్వాత కొందరి ఒత్తిళ్లతో, ప్రేరేపించడంతో రాజలింగమూర్తి భార్య తనపై ఆరోపణలు చేశారని తెలిపారు.
రాజలింగమూర్తి హత్యపై సీబీసీఐడీ విచారణను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని, సీబీఐతో విచారణ జరిపించినా తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. మేడిగడ్డపై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారని, దానిని న్యాయపరంగా ఎదురొంటున్నామని చెప్పారు. మృతుడిపై భూవివాదాల ఆరోపణలతోపాటు రౌడీషీట్ కూడా ఉన్నదని తెలిపారు.
బీఆర్ఎస్పై, తనపై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్యలో అరెస్టయిన వ్యక్తుల పేర్లతో రాజలింగమూర్తి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, విచారించి నిజానిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిస్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతిభ్రమించిందని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలు కాంగ్రెస్‌కే అలవాటని, బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని స్పష్టంచేశారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌ను హత్య చేశారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కోమటిరెడ్డి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. వేముల వీరేశం ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. కోమటిరెడ్డి పూటకో మాట మాట్లాడతారని, ఆయన ఏం మా ట్లాడుతరో ఆయనకే తెలియదని మండిపడ్డారు. ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవుపలికారు.