హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ):మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించింది.
సిద్దిపేట జిల్లా పొన్నాలలోని గాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డులు మార్పు చేయడం చట్ట వ్యతిరేకమని గ్రామస్తు డు తుపాకుల బాలరంగం, ఇతరులు దాఖలు చేసిన వ్యా జ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. 5.34 ఎకరాలను చట్ట వ్యతిరేకంగా 2022 ఆగస్టు 6న జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.