Gandhi Hospital | హైదారాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 30 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలికి సర్జరీ చేస్తామని చెప్పి థియేటర్‌కు తీసుకెళ్లిన గాంధీ వైద్యశాల సిబ్బంది.. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే పట్టీ కట్టి సర్జరీ చేసినట్టు నమ్మించారని బాధిత మహిళ కు టుంబీకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదని, విధిలేక అక్కడి నుంచి వేరే దవాఖానకు వెళ్తే అసలు విషయం తెలిసిందని వాపోయారు. అక్కడి వైద్యులు పట్టీ విప్పి చూసి అసలు సర్జరీ యే చేయలేదని, చెయ్యి మొత్తం కుళ్లిపోయిందని, దాన్ని పూర్తిగా తొలగించాలంటున్నారని బోరున విలపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఎదిరపల్లికి చెందిన రేవతమ్మ(50), వెంకటయ్య దంపతులు దినసరి కూలీలు. ఈ నెల 21న రేవతమ్మ జడ్చర్లలోని తన సోదరి ఇంటికి వెళ్లి సాయంత్రం వస్తునన క్రమంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ జారీ కింద పడిపోయిం ది. ఈ ఘటనలో రేవతమ్మ ఎడమ చెయ్యి కి తీవ్ర గాయమైంది. ఆమెను కుటుంబసభ్యులు ముందుగా మహబూబ్‌నగర్ ప్ర భుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా లేదా గాంధీకి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు రెఫ ర్ చేశారు. అదే రోజు రాత్రి ఆమెను గాంధీ కి తీసుకెళ్లగా అత్యవసర విభాగంలో చేర్చుకున్న వైద్యులు, చెయ్యి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులను పిలిపించి రోగికి 23న ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని, రక్తం అవసరం ఉంటుందని, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించా రు. 23న ఉదయం రోగి బంధువులు ఆరుగురు దవాఖానకు చేరుకున్నారు.
సర్జరీ చేస్తాం, అవసరమైతే చెయ్యి తొలగించాల్సి వస్తుందని చెప్పి తమ నుంచి సంతకాలు తీసుకున్నట్టు కుటుంబ సభ్యు లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేస్తామని చెప్పి వివరాలు తీసుకున్నట్టు చెప్పా రు. చేతికి స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తుందని మరోసారి సంతకాలు తీసుకున్నట్టు వివరించారు. 6వ అంతస్థులోని ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్‌కు రోగిని తీసుకెళ్లి, రక్తం ఇచ్చిరావాలని తమను కిందికి పంపారని తెలిపారు. ఆరుగురు బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం ఇచ్చి అరగంటలోపు 6వ అంతస్థుకు రాగా అక్కడ రోగి కనిపించలేదని, ఆపరేషన్ అయిపోయింది, 7వ అంతస్థులోని వార్డుకు పంపామని చెప్పడంతో వెళ్లి చూసేసరికి బెడ్‌పై పడుకొని ఉన్నదని చెప్పారు. చేతికి పట్టీ ఉండడంతో తాము కూడా ఆపరేషన్ అయిపోయిందని నమ్మినట్టు వాపోయారు.
రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడం తో వైద్యసిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని, ఈనెల 28న అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చామని, 29న జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లామని తెలిపారు. అక్కడి సిబ్బంది బ్యాండేజ్‌ను తీసి చూసి అసలు సర్జరీ చేసిన ఆనవాళ్లే లేవని చెప్పారని, చెయ్యి పూర్తిగా కుళ్లిపోయిందని, వేరే దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పారని వాపోయారు. దీంతో 30న మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ దవాఖానకు వెళ్లినట్టు తెలిపారు. రోగిని పరిశీలించిన అక్కడి వైద్యులు చెయ్యిని తొలగించాల్సి వస్తుందని, దాదాపు రూ.4లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారని వివరించారు.
కూలీ పనులు చేసుకొని బతికే తాము అంత డబ్బు చెల్లించుకోలేమని మొర పెట్టుకోవడంతో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారని తెలిపారు. తీరా ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించిన సి బ్బంది ఇదివరకే గాంధీ దవాఖానలో సర్జ రీ కోసం ఆరోగ్యశ్రీ అప్రూవ్ అయిందని, మరోసారి ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ సర్జరీ చేయడం కుదరదని చెప్పారని బోరున విలపించారు. కాగా ఈ ఘటనపై గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్‌కుమారిని ‘నమస్తే’ వివరణ కోరగా విష యం తన దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మా అత్తమ్మకు యాక్సిడెంట్లో చేతికి దెబ్బతగిలింది. పేదోళ్లం. ప్రైవేట్‌కు పోయే స్థోమత లేక గాంధీకి తీస్కపోయినం. ఆపరేషన్ కోసం ఆరుగురం రక్తమిచ్చినం. మా అత్తమ్మను ఆపరేషన్ థియేటర్‌కు తీస్కపోయి మమ్ములను రక్తం ఇచ్చేందుకు కిందికి పొమ్మన్నరు. వచ్చే సరికి ఆపరేషన్ అయిపోయిందని చేతికి కట్టుకట్టి వార్డులో పెట్టిండ్రు. ఇది ఎంత అన్యాయం సార్..