Gandhi hospital : గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) లో ఓ అరుదైన ఆపరేషన్ (Rare operation) జరిగింది. ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్లు (Neurosurgeons), కంటి వైద్య నిపుణులు (Eye-specialists) కలిసి ఓ యువకుడి కంట్లో దిగిన స్క్రూడ్రైవర్ (Screw driver) ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ (Patient) కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అయితే కంట్లో స్క్రూడ్రైవర్ దిగడంతో యువకుడు ముందుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి చివరగా గాంధీ ఆస్పత్రికి వచ్చాడని చెప్పారు.
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ సీహెచ్ రాజ్‌కుమారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 8న యువకుడి కంట్లోకి స్క్రూడ్రైవర్ దూసుకెళ్లింది. దాంతో అతడు ముందుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అతడి కన్ను కింది బోన్‌కు పగులు వచ్చినట్లు గుర్తించారు. దాంతో నిమ్స్‌కు పంపించారు. నిమ్స్ వైద్యులు పరిశీలించి అతడిని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దాంతో ఏప్రిల్ 10న అతడు గాంధీకి వచ్చాడు.
గాంధీ ఆస్పత్రిలోని కంటి వైద్యులు అతడిని పరిశీలించి స్క్రూడ్రైవర్ కనుగుడ్డుకు తగులలేదని గుర్తించారు. కుడి కంటి కింద ముందువైపు ఉన్న బోన్‌ను తాకి, కనుగుడ్డు కింది భాగంలోకి దూసుకెళ్లినట్లు గమనించారు. అనంతరం ఆస్పత్రిలోని న్యూరో సర్జన్స్‌తో కలిసి యువకుడి కంటి నుంచి స్క్రూడ్రైవర్‌ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని రాజ్‌కుమారి తెలిపారు.