హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఈ నెల 14 నుంచి 24 వరకు విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సచివాలయంలోని తన చాంబర్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని చాటేలా గాంధీ జీవిత చరిత్ర సినిమాను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు.
విద్యార్థులను థియేటర్లకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా తిరిగి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత థియేటర్ల నిర్వాహకులు, విద్యా, రవాణా తదితర శాఖలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్‌కుమార్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఎఫ్డీసీ ఎండీ అశోక్‌రెడ్డి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, యూఎఫ్‌వో, క్యూబ్, సెరసెర, పీవీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.