హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును అనుమతించకుండా పోలీసులు గాంధీభవన్ గేట్లు బంద్ చేసినట్టు తెలిసింది. తాజ్ బంజారాలో గురువారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భేటీ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు అర్థంతరంగా వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే తన అధికారిక వాహనంలో గాంధీభవన్‌లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డగించినట్టు తెలిసింది.
ఆయనను బయటనే నిలబెట్టినట్టు సమాచారం. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రేమ్‌సాగర్‌రావు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమైన తమనే లోపలికి పంపరా అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నా రు. ఇటువంటి చేదు అనుభవమే ఎంపీ రేణుకా చౌదరికి కూడా ఎదురైనట్టు సమాచారం. కాగా గురువారం నాటి భేటీలో ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వలేమని ఖర్గే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. మంత్రి పదవికి బదులుగా చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేయగా ప్రేమ్‌సాగర్‌రావు నిర్దందంగా తోసిపుచ్చుతూ.. భేటీ నుంచి అర్ధంతరంగా బయటికి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు.