న్యూఢిల్లీ, జూలై 4: నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి చెప్తేనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి చెందిన యంగ్ ఇండియన్ సంస్థకు రూ.20 లక్షల విరాళం ఇచ్చానని ఆ పార్టీ నేత, 2019 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేసిన గాలి అనిల్‌కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. తాజాగా అనిల్‌తోపాటు మరొకరి వాంగ్మూలం తమ వద్దకు చేరిందని ఇండియా టుడే వెబ్సైట్ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వాంగ్మూలం ప్రకారం.. ‘యంగ్ ఇండియన్ బ్యాంకు ఖాతాలో కొంత సొమ్ము జమచేయాలని గాలి అనిల్‌కుమార్‌కు రేవంత్‌రెడ్డి సూచించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అనిల్‌కుమార్ తన బ్యాంకు ఖాతా నుంచి యంగ్ ఇండియన్ బ్యాంక్ ఖాతాకు 2022, జూలైలో రూ.20 లక్షలు బదిలీ చేశాడు’.
ఈ విషయాన్ని ఈడీ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్లో వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ ప్రధాన నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ ‘మనీ లాండరింగ్’ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను చౌకగా కాజేసేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది.
ఏజేఎల్‌కు రూ.2 వేల కోట్ల ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకొనేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. యంగ్ ఇండియన్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్‌కి 76% వాటా ఉన్నది. సోనియా, రాహుల్ ఆదేశాల మేరకు ప్రాంతీయ కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు సమకూర్చారు. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి ఆదేశాలతో తెలంగాణకు చెందిన నలుగురు కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్ కంపెనీకి 2022 జూన్‌లో రూ.80 లక్షల మేర విరాళాలు ఇచ్చారు.
పదవి, టికెట్లు ఆశచూపి
గాలి అనిల్‌కుమార్‌తోపాటు గుజరాత్‌కు చెందిన జయంతిభాయ్ పటేల్, ఆయన కుమారుడు జిమ్మీభాయ్ పటేల్ వాంగ్మూలం కూడా తమ వద్ద ఉన్నట్టు ఇండియా టుడే పేర్కొంది. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇవ్వాలని తన తండ్రికి సూచించారని జిమ్మీభాయ్ పటేల్ చెప్పారు. ఆ మేరకు తాము రూ.కోటి యంగ్ ఇండియన్ సంస్థకు పంపినట్టు వెల్లడించారు. యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇచ్చిన వారందరూ స్వచ్ఛందంగా ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది.
కొందరికి పదవి, టికెట్లు ఆశచూపి విరాళాలు సేకరిస్తే, మరికొందరిని రాజకీయ భవిష్యత్తు ఉండబోదని, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు సేకరించినట్టు వెల్లడించింది. కాంగ్రెస్ అగ్ర నేతల ఆదేశాల మేరకే రేవంత్‌రెడ్డి, అహ్మద్‌పటేల్, డీకే వంటి నాయకులు తమ పరిధిలోని సంపన్నులు, పార్టీ పదవులు ఆశిస్తున్న వారిని ప్రలోభపెట్టి లేదా బెదిరించి యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇప్పించినట్టు ఈడీ ఆరోపించింది.