హైదరాబాద్: విపక్ష ఎమ్మెల్యేల చేరికలపై క్షేత్రస్థాయిలో సొంతపార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ (Congress) మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇన్నాళ్లు తాము పోరాడిన వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని, ఇకపై వారితో ఎలా కలిసి కలిసి పనిచేస్తామంటూ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా హస్తం పార్టీ ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి (MLA Krishna Mohan Reddy) మూడురంగుల కండువా కప్పింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేతోపాటు పలువురు నాయకులు కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆయన పార్టీ మారుతున్నారని నెల రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధిష్ఠానంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ సరిత ఆధ్వర్యంలో గద్వాల నుంచి 500 మంది పార్టీ నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను హస్తం పార్టీలో చేర్చుకుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలంతా ఇబ్బందులు పడతారని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.