హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో మోదీ సర్కార్‌పై ఒత్తిడి తేవటంలో భాగస్వామ్యం అవుతానని ప్రకటించారు. గద్దర్‌తోపాటు కేంద్ర ఎస్సీ, ఎస్టీ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు గురువారం చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. పార్లమెంట్ కొత్త భవనానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని వినతిపత్రం అందజేశారు. త్వరలోనే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తానని గద్దర్ చెప్పారు. పార్లమెం టు భవనానికి అంబేద్కర్ పేరు పెట్ట డం సముచితమని రాష్ట్ర ప్రభుత్వం భావించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి వివరించారు.