హైదరాబాద్ : ప్రజా యుద్ధనౌక గద్దర్ తన జీవితంలో పాటను తూటాలా పేల్చి ప్రజలను ఉర్రూతలూగించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. ఆయన మరణం తీరని లోటని దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, తుది శ్వాస వరకు ప్రజల కోసమే బతికిన గొప్ప సంస్కృతిక సేనాని అని కొనియాడారు. ఆయన పాట స్ఫూర్తితో తెలంగాణలో ఎందరో కళాకారులు, గాయకులు వచ్చారని తెలిపారు. ప్రపంచం ఒక గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని అన్నారు.
బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన విఠల్ కళా జీవితం, విప్లవ ఉద్యమాలతో మమేకమై, తెలంగాణ ఉద్యమంతో అత్యున్నత స్థాయికి చేరిందని వెల్లడించారు. పాట బతికి ఉన్నంత కాలం ఆయనా బతికే ఉంటారని పేర్కొన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.