Adilabad | మంచిర్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌లో వర్గపోరుతోపాటు ‘కాసుల’ లొల్లి నడుస్తున్నది. అప్పుల విషయంలో కీలక నాయకులు ఒకరితో ఒకరు గొడవపడుతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాస్తో, కూస్తో పేరున్న నాయకులు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్ మధ్య పైసల కొట్లాట జరుగుతున్నది. వినోద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు నిరుడు రూ.25 లక్షలు అప్పుగా తీసుకొన్నారు. అడిగినప్పుడల్లా సమస్యల్లో ఉన్నానని చెప్తూ దాట వేస్తూ వచ్చారు. గట్టిగా అడిగిన ప్రతిసారి ప్రేమ్‌సాగర్‌రావు చెక్కులు ఇచ్చేవారు. కానీ ఆయన చెప్పిన రోజు అవి బ్యాంక్‌లో వేస్తే బౌన్స్ అయ్యేవి. దీంతో విసిగిపోయిన వినోద్, ప్రేమ్‌సాగర్‌రావుకు లీగల్ నోటీసులు పంపించారు. అయినా స్పందించకపోవడంతో చెక్‌బౌన్స్ కేసు వేశారు.
దీంతో ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ప్రస్తుతం ఇద్దరూ మాట్లాడుకోవడమే పూర్తిగా మానేశారు. తనపై కేసు వేసిన వినోద్‌పై ప్రేమ్‌సాగర్‌రావు రాజకీయ దాడి మొదలుపెట్టారు. బెల్లంపల్లిలో తన అనుచరులతో కలిసి లోకల్ ఫీలింగ్‌ను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ సైతం లోకల్ వాళ్లకే ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. దీంతో వినోద్ స్పీడ్ పెంచారు. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఉంటూ ఎప్పుడూ బెల్లంపల్లి ముఖం చూడని ఆయన కొంత కాలంగా యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే తాను.. తానంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇద్దరు కీలక నేతలు నువ్వా? నేనా? అంటూ తలోదారిలో వెళ్తుండడంతో ఎవరి వెంట ఉండాలో తేల్చుకోలేక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.