శాలిగౌరారం, జూలై 3: ‘కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పదేపదే కేసీఆర్, కేటీఆర్‌పై అబద్ధాలు ప్రసారం చేసి వ్యక్తిగత స్వేచ్ఛ్చకు భంగం కలిగించడం.. మహిళలు అని చూడకుండా ఫొటోలు పెట్టి ఏది పడితే అది పెట్టి చూపెట్టడం.. ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేయాలనుకుంటే కుదరదు’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్పష్టంచేశారు. వ్యక్తులను టార్గెట్ చేసి, కుటుంబాలను మానసికంగా ఇబ్బంది పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతామంటే చూస్తూ ఊరుకోబోమని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మహాటీవీ యాజమాన్యం చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్, కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తుంటే కడుపు రగిలిపోతుందని అన్నారు.
మహాటీవీ వంశీకృష్ణ తక్షణమే కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మీడియాతో మా ట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి, అక్రమ దందాలతో, గలీజు పనులతో ఓనర్‌గా మారిన వంశీకృష్ణకు తెలంగాణ నేతలపై మాట్లాడే నైతికహక్కు లేదని అన్నారు. ఇప్పటివరకు ఏ విచారణలోనూ ఒక్క అంశమూ తేలినట్టుగా ఏ ఒక్క అధికారి వెల్లడించలేదని తెలిపారు. చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించేలా కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రా కోవర్టులకు అండదండలు ఇస్తున్న రేవంత్ తోక కట్ చేస్తే అన్ని సెట్ అవుతాయని స్పష్టంచేశారు.