ఖైరతాబాద్, జూలై 12: ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నాడు కేటాయించిన ఇండ్లస్థలాలను తమకు అప్పగించాలని గచ్చిబౌలి ఎన్జీవోల ఇండ్లస్థలాల సాధన సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ పాండురంగారావు, బీ నర్సింగరావు మీడియాతో మాట్లాడారు.
2008లో అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్‌కు 189 ఎకరాలు, టీఎన్జీవోకు 160 ఎకరాలు, సెక్రటేరియట్ అసోసియేషన్‌కు 35 ఎకరాలు, హైకోర్టు అసోసియేషన్‌కు 37 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. అందులో మూడు సంఘాలకు ఇండ్ల స్థలాల పంపకం పూర్తిచేశారని, ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ప్లాట్ల పంపకం పెండింగ్‌లో పెట్టారని, దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. ఐఏఎస్ అధికారులతో కూడిన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు.