బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలోగల 30, 42, 43వ వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. గత నాలుగు రోజులుగా కూల్చివేతల కలకలంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్న కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోయిలేని ప్రభుత్వం, బాధ్యతలేని ముఖ్యమంత్రి, అర్థంపర్థం లేని మంత్రుల పనులతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడటం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. చెరువులు, కుంటలను రక్షించాలని, నీళ్లను సంరక్షించాలని అయితే అదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలపై బాధ్యత కూడా ఉండాలని సూచించారు.
ఈ 70 ఏండ్ల కాలంలో ఎక్కడా చెరువులు, నీటి కుంటలు, నాలాలకు బఫర్జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టలేదని అన్నారు. సూర్యాపేట సద్దుల చెరువు కింద ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్ కాదని, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్ర భుత్వమే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్‌ను కలిసి చెప్పనున్నట్టు తెలిపారు.