Funtastic | ‘అధ్యక్షా సమావేశం ప్రారంభానికి ముందు నాదో ప్రతిపాదన. మన హస్తం జెండా ఇక పై మూడు రంగుల్లో కాదు, నాలుగు రంగుల్లో ఉండాలి. ఒక రంగు పెంచడం ద్వారా మన బలం పెరిగిందని ప్రజలు, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టు అవుతుంది.’
‘తుమ్మల గారు మాట్లాడింది మాకు అర్థం కావడం లేదు …’
‘జానాగారూ… మీరు మాట్లాడింది ఏదో మాకు పెద్ద అర్థం అయినట్టు. వినండి సార్…’
‘కాలం మారింది మనమూ మారాలి. గాంధీ భవన్లో ఈ ఫొటోలు ఎవరివి. ఇవన్నీ అవసరమా?..’ అని తుమ్మల అనగానే, రేవంత్ మద్దతుగా చేయిఎత్తాడు. ‘అన్ని ఫొటోలు పెట్టారు. వీటి మధ్యలో బాబు ఫొటో లేకపోతే మాకు ఎంత అవమానం…!
‘తుమ్మల గారూ… మీరు గాంధీ భవన్కు మొదటిసారి వచ్చారు. కాబట్టి ఆ ఫొటోలో ఉన్నవారిని గుర్తించడం లేదేమో. వాళ్లంతా స్వాతంత్య్ర సమర యోధులు. ఆయన మహాత్మాగాంధీ, ఇది జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహద్దూర్ శాస్త్రి , సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావుల ఫొటోలు. గాంధీభవన్లో అవి మొదటి నుంచి ఉన్నాయి.’
‘ఏమో మాకు తెలుగు దేశం స్వతంత్ర పోరాటం జరిపింది. ఇందిరా గాంధీని ఎదురించింది… అంటూ మా బాబు చెప్పిన చరిత్ర మాత్రమే తెలుసు. వీళ్ల గురించి తెలియదు. మీరు వెంటనే తెలుగుదేశం చరిత్రను తెలిపే ఫొటోలు ఇక్కడ పెట్టండి. అప్పటి వరకూ ఈ సభకు నిండుదనం రాదు’
‘తుమ్మలకు మద్దతుగా రేవంత్ మళ్లీ చేయి ఎత్తాడు. సభ పచ్చ చొక్కాలు, పచ్చ కండువాలతో కళకళలాడుతున్నది. మూడు రంగుల వాళ్ళు అయోమయంగా చూడసాగారు. వారంతా జానారెడ్డి దగ్గరికి వెళ్లి మనం గాంధీ భవన్లో హస్తం మీటింగ్కు వచ్చామో, ఎన్టీఆర్ భవన్లో సైకిల్ మీటింగ్కు వచ్చామో అర్థం కావడం లేదు అన్నారు’
‘నాకు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. కమ్యూనిస్టుల జెండాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎర్ర రంగులో ధగధగలాడుతుంటాయి. తీరా ఎన్నికల్లో ఓట్లు రావు. నాయకులు, కార్యకర్తలు, జెండాలు మోసేవాళ్లు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లూ వాళ్లే. వాళ్లకు ఓటు వేసుకునేది కూడా వాళ్లే. అందుకే అంతరించిపోయారు. తెలంగాణలో ఆ స్థానాన్ని ఇప్పుడు సైకిల్ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ల జెండాలు, వీళ్ళ నాయకులు, వీళ్ళ ఓట్లు… అన్నీ వీళ్లే. కంగారు పడకండి, మనకేమీ ప్రమాదం లేదు’
‘సార్ మీరు ఇలానే చెబుతున్నారు. పీసీసీ పీఠం కూడా సైకిల్ వాళ్లే లాగేసుకున్నారు. సభలో కాంగ్రెస్ నాయకుల పేర్ల ప్రస్తావన లేదు కానీ, టీడీపీ నాయకుల భజన మాత్రం సాగుతున్నది’
‘మీరంతా నిశ్శబ్దంగా కూర్చుంటే నాదో తీర్మానం’
‘తుమ్మలగారూ… తీర్మానం చదవండి’
‘మాది ఒక్క రంగు. మీవి మూడు రంగులు. ఇకపై మన పార్టీ జెండా నాలుగు రంగుల్లో ఉండాలి’
‘రేవంత్ తుమ్మలను కౌగిలించుకొని అంగీకారం తెలిపారు. సైకిల్ లానే హస్తాన్ని ఎక్కడికో తీసుకువెళతాం అని ప్రతిజ్ఞ చేశారు’
‘పచ్చ చొక్కాల వాళ్ళు ఆనందంతో గెంతారు. ఉత్సాహంగా ఒకరినొకరు ఎత్తుకున్నారు.’
‘ఈ సందడిలో కిందపడ్డ జానారెడ్డి తన కళ్ళ జోడు వెతుక్కుంటూ, తనలానే కాంగ్రెస్ సీనియర్లు అందరూ కిందపడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
‘తెలుగు కాంగ్రెస్… వర్ధిల్లాలీ… అంటూ నినాదాలు వినిపించాయి.’
– మురళి