Congress | 30 ఇయర్స్ ఇండస్ట్రీ నాయకులంతా గాంధీ భవన్లో నిలుచుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో హస్తం బాస్ హాలులోకి ప్రవేశించి, మాట్లాడటం మొదలు పెట్టాడు.
‘మీరంతా పార్టీలో సీనియర్లు, వయసులో పెద్దవాళ్లు అయి కూడా నేను వచ్చిన దాకా నిలబడే ఉండి నాకు గౌరవం ఇవ్వడం సంతోషం. నేను లోనికి వచ్చినప్పుడు నిలబడితే చాలు. ఇక మీరంతా కూర్చోవచ్చు’ అన్నాడు.
‘సీనియర్లం అన్నది నిజమే. కానీ మేం నెహ్రూ కుటుంబానికి బానిసలం. ఢిల్లీలో నిర్ణయం తీసుకొని మా నెత్తిన ఎవరిని రుద్దినా భరిస్తాం తప్ప, గౌరవించే ప్రసక్తే లేదు’. అని సీనియర్ నేత గోపాల్‌రెడ్డి చెబితే అంతా చప్పట్లు కొట్టి సమర్థించారు.
‘గౌరవానిది ఏముంది? మనకు ఎన్నికలు ముఖ్యం. ఈ సమయంలో రహస్య సమావేశానికి ముఖ్యులైన మీ అందరినీ ఎందుకు పిలిచానో చెబుతా. పార్టీ హై కమాండ్ మీ అందరికీ శిక్షణ ఇవ్వమని నన్ను ఆదేశించింది.’
‘సూట్ కేసులు మోయడంలో తప్ప మీరు ఎందులో శిక్షణ ఇవ్వగలరు?’ అని వెనుక నుంచి సీనియర్ కామెంట్ చేయడంతో అంతా లోలోపలే నవ్వుకున్నారు.
‘వెనుక నుంచి ఈ మాట అన్నది ఎవరో కానీ, సరిగ్గా చెప్పారు. అధిష్ఠానం నన్ను హస్తం అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది సూట్ కేసులు మోయడంలో అనుభవాన్ని చూసే. మీరంతా ఓటుకు నోటు కేసులో నేను పట్టుపడ్డానని చిన్న చూపు చూస్తారు. నిజానికి నాకు అదో మెడల్. అందులో నా నైపుణ్యాన్ని చూసే పార్టీ బాధ్యతలు అప్పగించారు’.
‘సరే… ఎన్నికల్లో డబ్బులు ఎలా పంపించాలో చెబుతాను వినండి’
‘ఉమ్మడి రాష్ట్రంలో సిమెంట్ మిక్సింగ్ లారీల్లో, పాల లారీల్లో, చివరకు అంబులెన్సుల్లో, టైర్లలో డబ్బులు తరలించిన ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసి పోయాయి. సూట్ కేసుల్లో నోట్ల కట్టలు తీసుకువెళితే సీసీ కెమెరాలు ఉన్నాయి. దొరికిపోతాం. నేను అలానే దొరికి పోయాను. మీ అందరికీ ఒక్కొక్కరికి విడిగా చెవిలో చెబుతాను’ అని హస్తం అధ్యక్షుడు ఉపన్యాసం ముగించి ఒక్కొక్కరికి చెవిలో చెప్పి అందరినీ పంపించాడు.
****
‘సార్… నేను మన చానల్ రిపోర్టర్‌ను. మీరు చెప్పినట్టు డబ్బుల సంచులు తీసుకువెళుతుంటే అందరినీ వదిలేసి నన్నే పోలీసులు పట్టుకున్నారు…’
‘సార్… నేను రేకుల కంపెనీ నుంచి మాట్లాడుతున్నా. ఐటీ వాళ్లు రైడ్ చేసి ఎన్నికల కోసం దాచి పెట్టిన రూ.8 కోట్లు పట్టుకున్నారు’…అంటూ వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో ఎన్నికల్లో ఉన్న ఛానల్ ఓనర్ తలపట్టుకున్నాడు.
నాకేనా ఇంకెవరికైనానా అని టీవీ చూస్త్తే ఖమ్మం కామందు రెడ్డివి రూ. 8 కోట్లు దొరికాయని టీవీలో వస్తున్నది.
సంపన్నుల ఇంటిపైనే ఐటీ దాడులా, పేదల ఇళ్ల పై దాడులు చేయరా? ఇదెక్కడి వివక్ష… అంటూ వీళ్ల అభిమానులు ధర్నాలు మొదలుపెట్టారు. సంపన్న నాయకుల ఇంటిపై కాదు దమ్ముంటే మా ఇళ్లపై దాడి చేయండి… అని తూగుతూ కొందరు నినాదాలు చేస్తున్నారు.
***
ఎన్నికల కోసం రహస్యంగా దాచి, తరలిస్తున్న డబ్బు గురించి ఐటీ వాళ్లకు ఎలా తెలిసింది. అంజనం వేసి కనుగొన్నట్టు అక్కడికే వచ్చి ఎలా పట్టుకున్నారు?… అని సీనియర్లు ఒకరికొకరు మాట్లాడుకోసాగారు.
‘కొంపదీసి బాసే సమాచారం’… అని ఒకరు అంటుండగానే … ‘ఇది సీనియర్లను ఒక్క దెబ్బతో మట్టుపెట్టే కుట్ర’… అని అంతా భయంగా గుండెలపై చేయి వేసుకున్నారు.
– మురళి