Jagtial | జగిత్యాల, డిసెంబర్ 25: ఆస్తులు పంచుకుని పెద్దమ్మ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలోని తీన్ఖనిలో సాదుల సత్తమ్మ (85)- లక్ష్మణ్ దంపతులు నివసించేవారు. సత్తమ్మ భర్త లక్ష్మణ్ 20 ఏండ్ల క్రితం మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో తన భర్త లక్ష్మణ్ తమ్ముడి కొడుకులైన ప్రసాద్, రవిని సత్తమ్మ చేరదీసి వారికి ఆస్తులు పంచి ఇచ్చింది. సత్తమ్మను వారిద్దరూ వంతులవారీగా పోషిస్తున్నారు.
ఇటీవల అనారోగ్యంతో దవాఖానలో చేరిన ఆమె మంగళవారం రాత్రి మృతిచెందింది. దవాఖాన సిబ్బంది అంబులెన్స్‌లో మృతదేహాన్ని కాలనీకి తీసుకురాగా, ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ఇద్దరు కొడుకులూ నిరాకరించారు. ఆరు గంటల పాటు మృతదేహం అంబులెన్స్‌లోనే ఉన్న విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సత్తమ్మ పాత ఇంటి తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కొడుకులు ముందుకురాకపోవడంతో బుధవారం ప్రైవేట్ వ్యక్తులతో ఆఖరి మజిలీ నిర్వహించారు.