హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్.. హ్యామ్.. రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ జపిస్తున్న ప్రాజెక్టులివి. ఈ రెండూ రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ అని మంత్రి పదేపదే చెప్తున్నారు. అయినా, ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా, అవి విడుదల కావడంలేదు. నిరుడు ట్రిపుల్ ఆర్కు రూ.1,525 కోట్లు కేటాయించిన సర్కార్, అందులో కేవలం రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. మళ్లీ ఈ ఏడాది కూడా ట్రిపుల్ ఆర్కు బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్న వివిధ పథకాలకు రూ. 6,415 కోట్లు కేటాయించారు.
ఇందులో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల ప్రాజెక్టుకు భారీగా రూ.3,053 కోట్లు, ట్రిపుల్ ఆర్ పనులకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ట్రిపుల్ ఆర్కు నిరుడు బడ్జెట్లో కూడా రూ.1,525 కోట్లు కేటాయించినా అందులో విడుదల చేసింది కేవలం రూ. 100 కోట్లు మాత్రమే. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణకు రూ.5 వేల కోట్లు ఖర్చుకానుండగా, అందులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉన్నది. అయితే, ట్రిపుల్ ప్రాజెక్టు మొదట నాలుగు లేన్లుగా నిర్మించాలని భావించగా, అనంతరం పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా ఆరు లేన్లకు పెంచా రు. 2024 డిసెంబర్లోనే టెండర్లు పిలిచినా ఇంతవరకు తెరువలేదు. భూసేకరణ పూర్తికానందునే కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం లేదని సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ భూసేకరణ కోసం తన వాటాకింద ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించింది.
హ్యామ్ పనులు మొదలయ్యేదెప్పుడు?
రాష్ట్ర రహదారులను అద్దంలా మెరిపించేందుకు హ్యామ్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు నిరుడు బడ్జెట్లోనే ఆర్థిక మంత్రి ప్రకటించారు. హ్యామ్ పథకంలో భాగంగా 2028 నాటికి 17,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను సుమారు రూ.28,000 కోట్ల అంచనాతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గత బడ్జెట్ ప్రసంగంలోనే పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు ఖర్చుచేస్తే, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టు ఏజెన్సీ వెచ్చించి రోడ్డు పూర్తయ్యాక 15 ఏండ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హ్యామ్ ప్రాజెక్టు మొదటి విడతలో రూ 6,478 కోట్లతో 5,190 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రస్తుత బడ్జెట్లో మాత్రం కేవలం రూ.3,053 కోట్లతో సరిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం హ్యామ్ ప్రాజెక్టు కోసం దశలవారీగా రూ.12వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నది.
రోడ్ల మరమ్మతులకు గ్రహణం
వానకాలంలో కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతులకు రూ.2,500 కోట్లకుపైగా నిధులు కావాలని ఆర్అండ్బీ అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ర్టానికి వచ్చిన కేంద్ర బృందానికి సైతం ఈ మేరకు నివేదిక ఇచ్చారు. కానీ, అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి పైసా రాలేదు. జీహెచ్ఎంసీ రోడ్లు, ప్రధాన రాష్ట్ర రహదారులు మిన హా రాష్ట్రంలోని రోడ్లన్నీ రెండేండ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. బడ్జెట్లో మరమ్మతులకు నిధులు కేటాయించకపోగా, రోడ్ల నిర్వహణకు రూ. 828 కోట్లు కేటాయించా రు. పాడైపోయిన రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుం దో చూడాలి.
2026-27 బడ్జెట్లో ఆర్అండ్బీ పథకాలకు కేటాయింపులు