ఖమ్మం, నవంబర్ 16 : లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కోవడం అన్యాయమని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టంచేశారు. ఖమ్మంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై అక్రమ కేసులతో జైళ్లకు పంపడం అక్రమమని, ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి.. ఫార్మా కంపెనీలకు ఏజెంట్లలా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం సరైంది కాదని హితవు చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ నెల 19న లగచర్ల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని తెలిపారు. ఇటీవల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు కేజీ రామచందర్, కే రమ, కెచ్చెల రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వరరావు, చిన్న చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్, నవంబర్ 16 : ‘ఫార్మా కంపెనీల ఏర్పాటుకు 80 శాతం మంది రైతులు అంగీకరించినట్టు మీరెలా చెబుతున్నారు? అంటూ’ ఓ రైతు కొడంగల్ తహసీల్దార్‌ను ఫోన్లో ప్రశ్నించినట్టుగా పేర్కొంటున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల ఫోన్లో మాట్లాడగా అది శనివారం వైరల్‌గా మారింది. అయితే ఈ అంశాన్ని తహసీల్దార్ విజయ్‌కుమార్ కొట్టిపారేశారు. ఫార్మా భూసేకరణలో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న పది మందిలో ఒకరిద్దరు ఒప్పుకోవడాన్ని బట్టి.. దానిని 80 శాతంగా పేర్కొనడం జరిగిందని వివరణ ఇచ్చారు.