హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆదివారం ప్రకటించారు.
తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. దేశంలోనే ఐదు డీఏలు పెండింగ్లో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కావడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. పెన్షనర్ల సమస్యలను ఈ నెల 15లోగా పరిష్కరించపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తప్పదని హెచ్చరించారు.