FTCCI | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నదని, ఫలితంగా 2050 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) పర్యావరణ కమిటీ చైర్మన్, నీటి సంరక్షణ నిపుణుడు జీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. నీతి ఆయోగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంటూ.. పలు గణాంకాలను ఉదహరించారు. ఇకనైనా నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. ‘పరిశ్రమల కోసం నీటి భద్రత-సుస్థిర విధానం-నీటి సంరక్షణకు నేను ఏం చేయగలను?’ అనే అంశంపై శుక్రవారం ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ అధ్యక్షతన రెడ్‌హిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో సమావేశం జరిగింది.
బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ.. భూమి ఉపరితలం 71 శాతం నీటితో నిండి ఉన్నదని, మంచినీరు 2.5 శాతమేనని, అది కూడా ఎక్కువ భాగం భూగర్భంలోనూ, మంచు రూపంలోనూ నిక్షిప్తమై ఉన్నదని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే భూగర్భజలాల్లో నాలుగింట ఒక వంతును భారత్ వినియోగిస్తున్నద ని, అది అమెరికా, చైనాలో ఉపయోగిస్తున్న మొత్తం కంటే ఎకువని తెలిపారు. ఇప్పుడున్న సరఫరా కంటే 2030 నాటికి మన నీటి డిమాండ్ రెండింతలు పెరుగుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని, దీంతో కోట్ల మంది ప్రజలు తీవ్ర నీటిఎద్దడిని ఎదురొంటారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఈ సమావేశంలో పరిశ్రమల కోసం నీటి ఆడిటింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ , గ్రౌండ్ వాటర్ గవర్నెనెన్స్ తదితర అంశాలపై రోజంతా చర్చలు జరిగాయి.