హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానున్నది. ఫిబ్రవరి మొదటి వారంలోనే సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్ కాకుండా ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్ వంటి మిగిలిన ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు సైతం ఫిబ్రవరిలోనే విడుదల చేయాలన్న భావనలో అధికారులు ఉన్నారు. సెట్ కన్వీనర్ల సమావేశాన్ని బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సెట్ కన్వీనర్లకు పలు సూచనలు చేశారు. ఇంటర్ సెకండియర్ హాల్‌టికెట్లు విడుదలయ్యాక ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.