ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 : తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వాహణకు సరూర్‌నగర్ సమీపంలోని నివాసాల మధ్య ఉన్న విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదని మంత్రుల బృందం వెల్లడించింది. సోమవారం మంత్రులు మహమూద్‌అలీ, నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక పండ్ల మార్కెట్లో వసతులను పరిశీలించారు. బాటసింగారానికి బదులు విక్టోరియా మెమోరియల్ హాల్లో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని వ్యాపారస్థులు మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రుల బృందం విక్టోరియా హాల్‌ను సందర్శించింది. నివాసప్రాంతాల మధ్యలో ఉన్న విక్టోరియా హాల్లో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. దసరా నుంచి బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన షెడ్లలోనే పండ్ల మార్కెట్ ప్రారంభమవుతుందని స్పష్టంచేశారు. అలాగే, కోహెడలో అత్యాధునిక వసతులతో పండ్ల మార్కెట్ షెడ్ల నిర్మాణానికి కూడా దసరా రోజు భూమిపూజ చేయనున్నట్టు మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యాపారస్థులు, రైతులు బాటసింగారం పండ్ల మార్కెట్లో విక్రయాలు జరుపుకోవాలని సూచించారు.