EV Narasimha Reddy | హైదరాబాద్, జూన్24 (నమస్తే తెలంగాణ):ఆయన సర్కారు స్కూల్లో చదివారు. ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ఇప్పుడు అదే పాఠశాల విద్యాశాఖకు కమిషనర్‌గా నిమమితులయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈవీ నర్సింహారెడ్డికిపాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆయన 1989 డీఎస్సీలో జిల్లా మొదటి ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) గణిత ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవ్‌పూర్ మండలం మునిగడప పాఠశాలల్లో పనిచేశారు.
1995లో గ్రూప్ -1 ఉద్యోగం సాధించారు. 20 ఏండ్ల పాటు గ్రూప్ -1 అధికారిగా సేవలందించి, 2017లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. టీఎస్ఐఐసీ ఎండీగా ఆయన సుధీర్ఘకాలం సేవలందించారు. ఈవీ నర్సింహారెడ్డి తండ్రి సైతం సర్కారు స్కూల్లో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేయడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, సర్కారు బడిలో చదువుకుని ఇదే పాఠశాల విద్యాశాఖకు కమిషనర్ స్థాయికి ఎదిగిన నర్సింహారెడ్డిని పలువురు అభినందించారు. ప్రస్తుతం కాస్త అనారోగ్యంతో ఉన్న ఆయన, రెండు మూడు రోజల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది.
రిజ్వీ బదిలీ వెనకున్నదెవరు?
ఐఏఎస్‌ల బదిలీల్లో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ఎస్ఏఎం రిజ్వీని ప్రభుత్వం బదిలీచేసింది. ఆయనను ప్రభుత్వం ఎందుకు బదిలీచేసిందన్న చర్చలు సాగుతున్నాయి. మంత్రులు చెప్పినట్టు బిల్లులు చెల్లించనందుకే ఆయనపై బదిలీవేటు వేశారని ప్రచారం జరుగుతున్నది.
పలువురు విద్యుత్తు జనరేటర్లు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వవర్గాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయని, తమ అనుకూలురకు ఇప్పించుకునేందుకు పెద్ద లాబీయింగ్ నడిపారన్న ఆరోపణలున్నాయి. వారి ఒత్తిళ్లకు రిజ్వీ తలొగ్గకుండా మెరిట్, సీనియార్టీ ప్రతిపాదికన బిల్లులు చెల్లించే విధానాన్ని అమలుచేశారని, ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో కొందరు కక్షగట్టి బదిలీచేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమర్థవంతంగా సేవలందించారు. విద్యుత్తుశాఖలో ప్రక్షాళనకు నడుంబిగించారు. బిల్లులను ఇదివరకు చెక్కుల రూపంలో చెల్లించగా, రిజ్వీ వచ్చాక ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా ఆన్లైన్లో చెల్లించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. రిజ్వీని ఏరికోరి విద్యుత్తుశాఖ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కారే తీరా అయనపై బదిలీవేటు వేసింది.
కమిషనరే.. సమగ్రశిక్ష ఎస్పీడీ
పాఠశాల విద్యాశాఖ నుంచి సమగ్రశిక్షను వేరుచేసిన రేవంత్ సర్కారు, మళ్లీ ఇప్పుడు పాఠశాల విద్యాశాఖలోనే అంతర్భాగం చేసింది. మార్చిలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మల్లయ్యభట్టుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇదివరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్లకే సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టు లేకున్నా ప్రాజెక్ట్‌ను వేరుచేసి, డైరెక్టర్‌గా మల్లయ్యభట్టును నియమించింది. తాజా బదిలీల్లో మల్లయ్యభట్టు బీసీ సంక్షేమశాఖకు బదిలీ కాగా ఎస్ఎస్ఏ ప్రాజెక్డ్ డైరెక్టర్ బాధ్యతను ఈవీ నర్సింహారెడ్డికే అప్పగించింది.