హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) : లక్ష్యానికి అనుగుణంగా పనిచేయని ఆయిల్‌పామ్ కంపెనీలపై చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇకపై ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం ఆయన ఆయిల్‌పామ్ సాగుపై కంపెనీలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 1.25 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 31వేల ఎకరాల్లో మాత్రమే సాగు కావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలను సాగులోకి తీసుకొని రావాలని ఆదేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.