
ధర్మపురి రూరల్, ఆగస్టు 8 : వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన ధర్మపురి మండలంలోని బూర్గుపల్లిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బూర్గుపల్లికి చెందిన అల్లకొండ అక్షయ్ (17), సంపంగి అంజి (19) పక్కపక్క ఇండ్లల్లో నివసిస్తుంటారు. అక్షయ్ ఇంటర్ చదువుతూ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ, అంజి కులవృత్తి అయిన బండలు కొడుతూ కుటుంబానికి చేదొడువాదోడుగా నిలుస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం పనికోసం ధర్మపురికి వచ్చి ఆటోలో తిరిగి బూర్గుపల్లికి వెళ్తుండగా ధర్మపురి శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు ఎగిరి కిందపడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించారు. కాగా, ఘటనా స్థలాన్ని ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్ పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాలను జగిత్యాలకు తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.