హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన టెలీ పెర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. 1990వ దశకంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ పరిశ్రమ వృద్ధికి కృషిచేశాయని చెప్పారు. భారత్‌లో ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని టెలీ పెర్ఫార్మెన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు డానియల్ జూలియన్, సీఈవో అనీశ్ ముకర్ను కోరారు.
హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన వాతావరణంతోపాటు మానవ వనరులు, మౌలిక సదుపాయా లు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 165 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, కొత్తగా సిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని వెల్లడించారు. ఐఎస్బీ తరహాలో నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించే ఈ వర్సిటీ స్థాపనకు టాటా, మహీంద్రా కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఉత్తమ నివాసయోగ్య నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నుంచి దేశంలోని ఏ మెట్రో నగరానికైనా కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని, ఇక్కడ భూకంపాలు వచ్చే ఆస్కారం లేదని వివరించారు. రాష్ట్రం లో పర్యాటక అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, ఈ రంగంలో వృద్ధి రే టును 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నదని తెలిపారు. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జూన్‌లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌ను నిర్వహించనున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఈ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.