హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫారాలివ్వాలన్న అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేసే అంశంపై శనివారం సర్కారు వివిధశాఖల అధికారులతో సంప్రదింపులు జరిపింది. సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే 2026-27విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఉచిత యూనిఫారాలిస్తారు.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో వచ్చే విద్యాసంవత్సరం దాదాపు 2లక్షల విద్యార్థులుంటారని అంచనా. సర్కారు బడుల్లోని 24లక్షల మంది విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ప్రతి ఏటా రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నది. ఒక్కో జతకు రూ. 600 చొప్పున మొత్తంగా రూ. 133 కోట్లు వెచ్చిస్తున్నది. ఇంటర్ విద్యార్థులు ఎత్తు, పొడవు కాస్త ఎక్కువగా ఉండటంతో ఒక జతకు రూ.750, రెండు జతలకు రూ. 1,500 ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఏటా రూ. 30 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని తేల్చారు.