Harish Rao | సిద్దిపేట కమాన్, నవంబర్ 4: ఈసారి మంత్రి హరీశ్‌రావుకు లక్షన్నర మెజార్టీ రావాలని ఆకాంక్షిస్తూ సిద్దిపేటకు చెందిన నాయీబ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ వృద్ధులకు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 2 వరకు 50 ఏండ్లు నిండిన వృద్ధులకు ఉచిత సేవ ప్రకటించాడు. 2018లోనూ లక్ష పైచిలుకు మెజార్టీ రావాలని ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేశాడు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మంత్రి హరీశ్‌రావుపై ఉన్న ప్రేమ.. అభిమానంతో సేవలందిస్తున్నాడు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘హరీశ్‌రావు అంటే నాకు ఎనలేని అభిమానం. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మంత్రి హరీశ్‌రావుపై నా హేర్ కటింగ్ సెలూన్లో వృద్ధులకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాను. కేసీఆర్‌నగర్ డబుల్బెడ్రూం కూరగాయల మార్కెట్ వెనకాల హరీశన్న పేరుతో హెయిర్ కటింగ్ సెలూన్ ఏర్పాటు చేసుకున్న. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
ఆదివారం, బుధవారం తప్ప మిగతా రోజుల్లో ఉచిత కటింగ్, షేవింగ్ చేస్తున్నా’.. అని చెప్పాడు. ‘2018 ఎన్నికల్లో కూడా హరీశ్‌రావుకు లక్ష పైచిలుకు మెజార్టీ రావాలని కోరుతూ వేములవాడ కమాన్ దగ్గర 75 రోజుల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేశా. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒకరికి మన సిద్దిపేట సాధించిన అభివృద్ధి గురించి వివరిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేద్దాం.. వేపిద్దాం.. భారీ మెజార్టీతో హరీశ్ అన్నను గెలిపిద్దాం.. అని చెబుతున్నా. కారు గుర్తుకే ఓటు వేయాలని.. హరీశ్ అన్న భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నా’.. అని చెబుతున్నాడు.