హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బడి పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవ్వాలని యోచిస్తున్నది. వీటితోపాటు సాక్స్‌లు, టై, బెల్ట్, ఐడీ కార్డులను కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నది. దీని కోసం పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల బడులు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లు, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల్లోని 25 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నదని, ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్కారు బడుల్లోని పలువురు నిరుపేద విద్యార్థులు బడి బ్యాగులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు.
యూరియా, డీఏపీ వంటి ఫర్టిలైజర్ సంచులను బ్యాగులుగా వాడుతున్నారు. ఈ సమస్య సీఎం కే చంద్రశేఖర్‌రావు దృష్టికి కూడా వచ్చినట్టు తెలిసింది. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్న క్రమంలోనే షూ, సాక్స్, టై, బెల్టు, ఐడీ కార్డు కూడా ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. ఇది అమలైతే సర్కారు బడులన్నీ కార్పొరేట్ స్కూళ్లను తలపించనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్స్‌లు, టై, బెల్ట్ ఉచితంగా అందజేస్తున్నారు. ఇదే తరహాలో సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు కూడా వీటిని అందజేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పాఠశాల విద్యాశాఖ అధికారులు కొటేషన్ తెప్పించారు. రూ.298 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు.