హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచితంగా న్యాయసేవలను అందించాలనే లక్ష్యంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన-2025’లో భాగంగా రాష్ట్రంలోని 8 జిల్లా సైనిక్ బోర్డుల్లో ‘లీగల్ సర్వీసెస్ క్లినిక్’లు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని సైనిక్ బోర్డుల్లో ఏర్పాటైన వీటిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం ‘వీర్ పరివార్ సహాయత యోజన-2025’పై అవగాహన కల్పించేందుకు హిందీలో రూపొందించి తెలుగులోకి అనువదించిన థీమ్ సాంగ్ ‘ఏక్ ముతి ఆస్మాన్’ను ఆవిష్కరించారు. ‘లీగల్ సర్వీసెస్ క్లినిక్‌లో ఓ ప్యానల్ న్యాయవాదితోపాటు పారా లీగల్ వాలంటీర్, డీఎల్ఎస్ఏ ఉంటారు. వీరంతా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లీగల్ సర్వీసెస్ క్లినిక్‌లో ఉండి, న్యాయ సహాయం కోసం వచ్చే మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా సేవలు అందిస్తారు.