ఖైరతాబాద్, సెప్టెంబర్ 30: నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా త్వరలో 500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నది. ఇటీవల బ్రిటన్ వైద్యులతో కలిసి నిమ్స్ వైద్యులు 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడంతో ప్రస్తుతం వారు పూర్తిగా కోలుకుంటున్నారు. శనివారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో యూకే వైద్యుల సత్కార కార్యక్రమ ముఖ్య అతిథి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతోపాటు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. రూ.4 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సలను బ్రిటన్‌కు చెందిన డాక్టర్ రమణారావు పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్న పిల్లందరికీ ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్‌రావు ఆలోచన ఎంతో గొప్పదని బ్రిటన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణారావు దన్నపునేని కొనియాడారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
రోగుల తల్లిదండ్రులు సురేశ్, నందిని (ఛత్తీస్‌గఢ్), షేక్ మదీనా (సూర్యాపేట) మాట్లాడుతూ.. తమ పిల్లను కాపాడిన తెలంగాణ ప్రభుత్వానికి, నిమ్స్, బ్రిటన్ వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం డాక్టర్ రమణారావుతోపాటు వైద్యులు గీత, నాగ్కిశోర్ పుప్పాల, ఆండ్రియా ఉడ్స్, ఆదిల్ దినకర్, ఇవార్స్ వెగరీస్, సుబ్రమణియన్ చెలప్పన్, ఇవా జరీనా, జెన్నా ఇంగ్మాన్లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియో థోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్ తదితరులు ఘనంగా సత్కరించారు.