Bhu Bharati | యాదాద్రి భువనగిరి, జనవరి 13(నమస్తే తెలంగాణ) : భూ భారతిలో అక్రమాల నిగ్గు తేలుతున్నది. భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అవినీతి పుట్టలో నుంచి పాములు బయటకొస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏ మేరకు రిజిస్ట్రేషన్ రుసుము స్వాహా చేశారనే కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజులుగా ఆర్డీవోలు, తహసీల్దార్ల ముమ్మర విచారణలో 1,376 అనుమానిత డాక్యుమెంట్లు ఉండగా, 1,017 డాక్యుమెంట్లలో అక్రమాలు జరిగినట్టు తేలింది. ప్రభుత్వ ఖజానాకు రూ.3.72 కోట్ల గండికొట్టినట్టు గుర్తించారు. తహసీల్దార్ల ఫిర్యాదు మేరకు మొత్తం 80మంది మీ సేవ, సీఎఎస్సీ(కామన్ ఫెసిలిటీ సెంటర్) నిర్వాహకులు, ఆపరేటర్లపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లు, ఐటీ చట్టంలో 66(డీ) సెక్షన్ కింద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మోటకొండూరులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో రూ. కోటి వరకు ఫ్రాడ్ జరుగగా, ఆ తర్వాత రాజాపేట, యాదగిరిగుట్టలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇంతమందిపై కేసులు నమోదు కావడం జిల్లాలో సంచలనం రేపింది.
ఒక్క రూపాయితోనూ రిజిస్ట్రేషన్ చేయడం భూ భారతి పోర్టల్ డొల్లతనాన్ని తెలియజేస్తున్నది. ఉదాహరణకు.. అడ్డగూడూరులో 220962314 అనే అప్లికేషన్ నంబర్‌తో ఒకరికి సేల్‌డీడ్ చేశారు. ఇందుకోసం రూ.7,327 చలానా కట్టాలి. కానీ కేవలం ఒక్క రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా రూ.7,326 జేబులో వేసుకున్నారు. బీబీనగర్‌లో 2025 జూన్‌లో 2500409215 నంబర్‌తోనూ ఒక్క రూపాయికే గిఫ్ట్‌డీడ్ చేశారు. ఇక్కడ రూ.6,725 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్టారు.
రిజిస్ట్రేషన్ల సమయంలో మీసేవ, సీఎస్సీ నిర్వాహకులు, ఆపరేటర్లు నేర్పుతో సర్కార్ సొమ్మును అప్పనంగా స్వాహా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మరో టెక్నిక్‌ను ఉపయోగించారు. రూ.1,03,350 చలానా కట్టాల్సి ఉండగా, ఇందులో చివరి రెండు అక్షరాలు (5,0) రాకుండా 1,033 మాత్రమే కట్టి.. సర్కార్‌కు కుచ్చుటోపీ పెట్టారు. మరో కేసులో 90,635 చలానాకు గాను మొదటి మూడక్షరాలు అయిన రూ.906 మాత్రమే పే చేశారు. 3,14,990 చలానాకు చివరి మూడక్షరాలు 990 మాత్రమే కట్టారు. దాదాపు అన్ని డాక్యుమెంట్లలోనూ ఇదే విధానాన్ని అవలంబించారు. మరోవైపు కుంభకోణంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రిజిస్ట్రేషన్ సమయంలో సదరు కొనుగోలుదారులు చెల్లించిన నగదు మొత్తాన్ని తహసీల్దార్ ఎండార్స్ చేసి సంతకం చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొడకండ్ల, జనవరి 13 : భూ భారతి అక్రమాల సెగ జనగామ జిల్లా కొడకండ్ల మండల రైతులకు తగులుతున్నది. నిబంధనలకు విరుద్ధగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలతో అధికారులు బాధితులైన రైతులకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతున్నది. రిజిస్ట్రేషన్ సమయంలో తక్కువ రుసుము చెల్లించి పట్టాలు పొందారని, ఆ బాకీ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేకపోతే రద్దు చేస్తామని తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని కంగుతిన్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయంపై తహసీల్దార్ చంద్రమోహన్‌ను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆన్లైన్ రిపోర్టులను పరిశీలించామని, మండలంలో 25 అనుమానాస్పద రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయగా ఆరు మాత్రమే నిబంధనల ప్రకారమే ఉన్నట్లు తేలిందని తెలిపారు. మిగతా 19 రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి రుసుము జమ కాలేదని నిర్ధారణ కావడంతో వారికి రికవరీ నోటీసులు అందజేశామని స్పష్టం చేశారు.